గవర్నర్లు బీజేపీ ఏజెంట్లు.. విజయ్‌ను వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలి: కపిల్ సిబాల్

  • మెజార్టీ లేదంటూ విజయ్‌కు ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వని గవర్నర్
  • మెజర్టీని నిరూపించుకోవాల్సింది రాజ్‌భవన్ లో కాదన్న సిబాల్
  • రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరని విమర్శ

తమిళనాడు రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా మారుతున్నారని, ఆ పార్టీ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వారు తుంగలో తొక్కుతున్నారని కపిల్ సిబాల్ ఘాటుగా విమర్శించారు. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌ను వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్‌భవన్ లో కాదని, అసెంబ్లీ వేదికగా ఆయన తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సిబాల్ స్పష్టం చేశారు.

గతంలో సర్కారియా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను, సుప్రీంకోర్టు స్థిరపరిచిన చట్టాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత మెజారిటీ కోసం కుదుర్చుకునే పొత్తుల కంటే, ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన వారికే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Kapil Sibal
Tamil Nadu politics
Governor
BJP
TVK
Vijay Tamil Nadu
Tamil Nadu Chief Minister
Floor Test
Supreme Court
political crisis

More Telugu News